Wednesday, 13 July 2011

comment about pleenary

కాంగ్రెస్ నుంచి బయటపడి కొత్తపార్టీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే పరిణితి చెందిన నాయకుడిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎదుగుతున్న తీరు అందరినీ అబ్బురపరుస్తోంది. తండ్రిని మించిన తనయుడిగా జగన్ అందరి నోళ్లలో నానుతున్నారు. ఇడుపులపాయలో రెండు రోజులపాటు సాగిన తొలి ప్లీనరీలో జగన్ నేర్పుగా వ్యవహరించిన తీరు రాజకీయ ఉద్దండులను సైతం విస్మయానికి గురిచేసింది. ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుంచి అంచనాలకుమించి ప్రతినిధులు హాజరయ్యారు. ప్లీనరీ నిర్వహణ పట్ల ప్రతినిధులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారంటే, అది జగన్ ప్రతిభేనని చెప్పక తప్పదు. కాంగ్రెస్ హైకమాండ్‌ను సైతం ధిక్కరించి తనను నమ్మి చేదోడు వాదోడుగా నిలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖ నేతలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు.
కొత్త పార్టీ అయినప్పటికీ ప్లీనరీని మిగతా రాజకీయ పార్టీలకు తీసిపోని విధంగా విజయవంతంగా నిర్వహించడమే కాకుండా, పార్టీ దిశా దశ పేరుతో ప్రకటించిన హామీలు రాజకీయ పార్టీలను, ప్రతిపక్ష, అధికార పార్టీ నేతలను కలవరపాటుకు గురిచేశాయి. ప్లీనరీలో ఎక్కడా తడబాటు లేకుండా అనుభవం కలిగిన రాజకీయ నేతగా జగన్ చేసిన ప్రసంగాలు పలువురిని ఆకట్టుకున్నాయి. సందర్భానుసారం అధికార, ప్రతిపక్ష పార్టీలు, సోనియాపై విమర్శనాస్త్రాలు సంధించిన జగన్, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వరాలు కురిపించినట్టు స్పష్టమవుతుంది. అయితే, భవిష్యత్ ప్రణాళికను మిగతా రాజకీయ పక్షాలకంటే ముందే ప్రకటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయగలిగారు. ప్లీనరీలో జగన్ ప్రసంగం అటు ప్రతినిధులను, ఇటు నేతలను కట్టిపడేసింది. జగన్ ప్రసంగాల్లో తండ్రి హవాభావాలు స్పష్టంగా కనిపించాయి. తండ్రి తరహాలోనే మాట తప్పని, మడమతిప్పని నేతగా ఎదిగేందుకు ప్లీనరీని వాడుకున్నట్టు స్పష్టమవుతోంది.
సున్నితమైన తెలంగాణ అంశంపై పార్టీ వైఖరిని ప్రకటిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలు పరిణితి చెందిన నేతను తలపించాయి. తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామంటూ తెలంగాణ వాదులను ఆకట్టుకున్నారు. అదే సమయంలో తెలంగాణ ఇచ్చేటంత శక్తి, అడ్డుకునే శక్తి తమకు లేదని బాహాటంగానే చెప్పుకొచ్చారు. జగన్‌ను నిశితంగా పరిశీలిస్తే భవిష్యత్తులో తండ్రిని మించిన నాయకుడిగా ఎదిగే లక్షణాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ముఖ్యంగా వైఎస్ హఠాన్మరణం అనంతరం జగన్‌ను రాజకీయంగా అణగదొక్కేందుకు అటు కాంగ్రెస్, ఇటు వైరివర్గాలు శతవిధాల ప్రయత్నించాయి. జగన్ కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డుతగిలాయి. ఆ సమయంలో ఆయన కుటుంబీకులు, శ్రేయోభిలాషులు కొంతకాలం సంయమనం పాటించాలని, సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. దీన్ని తు.చ తప్పకుండా పాటించిన జగన్ సమయం వచ్చినపుడు కాంగ్రెస్‌పైన, వైరిపక్షంపైన విరుచుకుపడ్డారు.
ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల కారణంగా మిగతా పార్టీల్లో అనిశ్చితి నెలకొనడంతో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్న భావన ప్లీనరీతో కలిగించగలిగారు జగన్. అదనుచూసి తల్లి విజయమ్మను ప్రజల్లో తీసుకురావడం వెనుక జగన్ వ్యూహం స్పష్టమవుతోంది. ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన విజయమ్మ తొలిసారి ప్లీనరీలో సుధీర్ఘంగా ప్రసంగించి అందరినీ అబ్బురపరిచారు. రానున్న రోజుల్లో వైఎస్‌ను జగన్ మించిపోవటం ఖాయమన్నది రాజకీయ విశే్లషకుల భావనగా కనిపిస్తోంది.

No comments:

Post a Comment